మక్కపేటలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
మొక్కలు నాటిన జిల్లా, మండల అధికారులు
వత్సవాయి, జూన్ 5 యువ గళం న్యూస్ :
మండల పరిధిలోని మక్కపేట గ్రామ పంచాయతీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి ముఖ్య అతిథులుగా హాజరై, స్థానిక అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, భావితరాలకు పచ్చని పర్యావరణాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) మరియు మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు, ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో (APO), గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతగా కాపాడుకోవాలని అధికారులు ఈ సందర్భంగా గ్రామస్థులను కోరారు