ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం పెరగాలి: శ్రీరాం తాతయ్య ​పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం ​హాజరైన కమిటీ సభ్యుడు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్

ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం పెరగాలి: శ్రీరాం తాతయ్య
​పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం
​హాజరైన కమిటీ సభ్యుడు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్
​అమరావతి యువ గళం న్యూస్ :
ప్రజా ధన వినియోగంపై సమగ్ర పర్యవేక్షణ, ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం పెంపొందించడం ద్వారానే పాలనలో మరింత పారదర్శకత సాధ్యమవుతుందని జగ్గయ్యపేట శాసనసభ్యుడు, పీఏసీ కమిటీ సభ్యుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పేర్కొన్నారు. అమరావతిలోని శాసనసభ భవనంలో శుక్రవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం కమిటీ ఛైర్మన్ పులపర్తి రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు ఇతర కమిటీ సభ్యులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
​శాఖల పనితీరు, కాగ్ నివేదికలపై విస్తృత చర్చ
​ఈ సందర్భంగా పరిశ్రమలు-వాణిజ్య శాఖ (గనులు), రెవెన్యూ (దేవాదాయ) శాఖల పనితీరుపై కమిటీ సుదీర్ఘంగా సమీక్షించింది. ప్రధానంగా కాగ్ (CAG) నివేదికలలో ప్రస్తావించిన అంశాలు, గతంలో పీఏసీ చేసిన సిఫార్సుల అమలు పురోగతిపై విస్తృతంగా చర్చించారు. గనులు, భూగర్భశాఖ పనితీరుపై నిర్వహించిన ఆడిట్ నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ.. కమిటీ సభ్యులు సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరారు. ప్రభుత్వ ఆదాయ వనరుల పరిరక్షణ, ఖనిజ సంపద వినియోగంలో పారదర్శకత, ప్రజా ధన వినియోగంలో బాధ్యతాయుత వ్యవహారం ఉండేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కమిటీ సూచించింది. ఆలయ ఆస్తుల సంరక్షణకు ప్రాధాన్యత అనంతరం దేవాదాయ శాఖకు సంబంధించిన ఆలయాల నిర్వహణ, దేవాదాయ భూముల పరిరక్షణ, ఆదాయ వనరుల నిర్వహణపై కమిటీ సమీక్ష జరిపింది. ఆడిట్ నివేదికల్లో గుర్తించిన లోపాల సవరణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కమిటీకి వివరించారు. ఆలయ ఆస్తులను సంరక్షించడంతో పాటు భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రజల ప్రయోజనాలే పరమావధి..
​సమావేశం అనంతరం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ.. ఆడిట్ నివేదికల్లో ప్రస్తావించిన లోపాలను సకాలంలో సరిదిద్దడం ద్వారా ప్రభుత్వ విభాగాలలో పారదర్శకతను పెంచవచ్చన్నారు. ప్రజల ప్రయోజనాలను, ప్రజాధనాన్ని దృష్టిలో ఉంచుకుని కమిటీ తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.