రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టి కృషి అవసరం: డీసీపీ బి.లక్ష్మీనారాయణ
వత్సవాయి యువ గళం న్యూస్ :
మండల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రమాదాల అదుపునకు సమిష్టి కృషి అవసరమని రూరల్ జోన్ డీసీపీ బి.లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న పలు (యాక్సిడెంట్ ప్రోన్) ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక పెద్దలు, గ్రామస్థులతో డీసీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన నివారణ చర్యలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...
"ప్రాణ నష్టాన్ని నివారించడమే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యం. ప్రమాదకరమైన మలుపులు, జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగిన నివారణ చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా స్థానిక పెద్దలు కూడా అవగాహన కల్పించాలి."
ఈ కార్యక్రమంలో డీసీపీ వెంట జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వరరావు, వత్సవాయి ఎస్ఐ ఉమామహేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.