జగ్గయ్యపేట, జూన్ 11 యువ గళం న్యూస్ : పట్టణంలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు పుస్తకాలు, యూనిఫారాల పేరిట తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారానికి పాల్పడుతున్నాయని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై పది రోజుల క్రితమే విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ తాళాలు లేవంటూ సుమారు రెండు గంటల పాటు విలేకరులను, అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయగా, నాయకుల ఆందోళనతో గది తాళాలు తీయడంతో లక్షలాది రూపాయల విలువైన పుస్తకాలు, యూనిఫారాల నిల్వలు బయటపడ్డాయి. ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో స్థానిక తహసిల్దార్ ఘటనా స్థలానికి చేరుకుని, విద్యాశాఖ అధికారులు రాకుంటే తామే గదికి సీల్ వేసి అధికారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి సదరు కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విద్యార్థులను ఏకం చేసి అన్ని ప్రైవేటు స్కూళ్ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరావు, మండల కార్యదర్శి ప్రణయ్ తేజ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాల్ సలాం, రిహాన్, రెహమత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.